సాహిత్యం
Kura yadaiah|November 1st,2025
హిందు 9న్యూస్ బ్యూరో :
సామాజిక రాజకీయ/ వార్తా విశేషాల సమాహారం

Reding :
మహిళా గొంతుక ‘మాతృక’ ప్రగతిశీల మహిళాసంఘం (POW) అధికార పత్రికగా 1991 నుండి -దాదాపు 34 సంవత్సరాల క్రితం తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని మాతృక సంపాదకవర్గం ప్రకటించింది.
మహిళల ప్రయోజనాలు, మహిళా విముక్తి పట్ల ఆర్తితో, జండర్ భావనతో ప్రచురించే పత్రికల్లో మాతృక ఒకటి. దాదాపు మహిళలే రచయిత్రులుగా -మహిళలచే, మహిళల కోసం -ముందుకు వస్తున్న పత్రిక మాతృక అంంటూ సంపాదకవర్గం స్పష్టం చేసింది.

మహిళా విముక్తికి సంబంధించిన అనేకానేక ధోరణులు, భావజాలాలు, పరిష్కారాలు మీద చర్చ జరుగుతున్న సందర్భంలో, విప్లవ శ్రామిక మహిళా సంఘాల ఆవశ్యకతను గతం కంటే ఎక్కువగా గుర్తించిన కాలంలో, తమ భావజాల ప్రచారానికి ఒక శ్రామిక మహిళా పత్రిక అవసరాన్ని ప్రగతిశీల మహిళాసంఘం గుర్తించిందని అన్నారు.
సాహిత్యంతో సంబంధం లేని పాఠకులు కూడా అర్థం చేసుకొనే విధంగా, శిల్పానికి తగు ప్రాముఖ్యం ఇస్తూ పత్రికలు రావాల్సిన అవసరాన్ని గుర్తించి, మహిళా పత్రికలు మాత్రమే ఆ పని చేయగలవని ప్రగతిశీల మహిళాసంఘం అభిప్రాయపడింది.
ప్రగతిశీల మహిళా ఉద్యమాలు మొదలైన తరువాత ‘మాతృక’ అవసరం పెరిగింది సంపాదకవర్గం అభిప్రాయపడింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మహిళలు ఎదుర్కొనే దోపిడీ, పీడనా, వివక్షతలకు మూల కారణమైన లైంగిక శ్రమ విభజనను ఎత్తి చూపటానికీ, రాజకీయ రంగంలో స్త్రీల సమానత్వానికి పెను ఆటకంగా దాపురించిన పితృస్వామిక అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఎండగట్టటానికి ఒక పత్రిక కావాల్సి వచ్చిందని స్పష్టం చేసింది . ఈ చారిత్రిక సందర్భం మాతృక ఆవిర్భావానికి అనివార్యంగా దారి తీసింది అని పేర్కొంది.

అలా ప్రారంభం అయిన మాతృక త్వరలో 125వ అడుగు ఎక్కబోతోంది. ఈ 125 నెలల కాలం మాతృక పరిణితి చెందటానికి సరిపడినంత దీర్ఘమైన కాలం. సరిపడినంత సత్తా ఇచ్చిన కాలం. భారతీయ సందర్భంలో చూస్తే అత్యంత కీలకమైన కాలం. ఈ కాలంలో మాతృక నూరు పూలు పూసింది. వెయ్యి భావాలను సంఘర్షించుకోనిచ్చిందని అన్నారు. ఈ కాలమంతా యథాతథ స్థితిని సవాలు చేసిన గొంతుకలను మాతృక ప్రస్పుటంగా వినిపించింది సంపదకవర్గం పేర్కొది.
పోరాడే ప్రజల ప్రతిఘటన, దృఢ చిత్తం, నిబద్ధతల వీలునామాలను లిఖించింది. ఆలోచనాత్మకమైన సంభాషణ, నిరసనలకు వేదికగా ఉండాలనే సామూహిక దృష్టికోణం నుండి ఆ నాడు ఉదయించిన మాతృక -వర్గ, కుల స్పృహల ప్రాతిపదికగా మహిళా సమస్యలను, వర్తమాన రాజకీయాలను అర్థం చేయిస్తూ వచ్చింది. భారతీయ రాజకీయ దృశ్యం పూర్తిగా వివాదాస్పదం అయినపుడు -మాతృక నిర్భయమైన విమర్శనా వ్యాసాలను, కథనాలను, కథలను, కవితలను ప్రచురించింది అని తెలిపింది.

తమ ఆవేదనలను వెల్లడించే అవకాశాన్ని అనేకమంది రచయితలకు, మేధావులకు, ప్రజాసంఘాల కార్యకర్తలకు, సాధారణ పౌరులకు కలగచేసింది మాతృక.
విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో; వివాహం, ఆస్తి, వారసత్వం, సంతానోత్పత్తి, పిల్లల పెంపకం, ఇంటి చాకిరీ, కుటుంబ హింస, అత్యాచారాలు, అశ్లీల సంస్కృతి మొదలైన అంశాలలో -స్త్రీల మీద జరుగుతున్న అణచివేత, వివక్ష, అసమానతలను పట్టి చూపించింది. రాజకీయాలతో పాటు ముఖ్యంగా కులం, మతం, రాజ్యం, చట్టాలు స్త్రీల పట్ల అమలు జరుపుతున్న సవాలక్ష అణచివేతలు, వివక్షలపై ఎలుగెత్తి తన గొంతును వినిపించింది. మాతృక శ్రామిక మహిళా ఉద్యమ పునాదిగా అన్ని పీడిత తాడిత వర్గాల సమస్యలపై వ్యాసాలు, వ్యాఖ్యలు, కథలు, కవితలు, రిపోర్టులను ప్రచురిస్తుంది. భారతదేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ వస్తున్న -ఉద్యమాల, పోరాటాల, నిరసనల ప్రకంపనలను ఒడిసి పట్టుకొని మహిళలకు అర్థం అయ్యే భాషలో ప్రచురిస్తూ వస్తోంది మాతృక సంపాదకవర్గం తెలిపింది.
మాతృక రచయితల్లో చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు. పెచ్చరిల్లుతున్న హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మహిళా ఉద్యమాలను నిర్మాణం చేయటమే కాదు, ఆ ఉద్యమాలను రాతపూర్వకంగా రికార్డు చేస్తున్నారు. మాతృక రచనలకు ప్రాణం పోసి సజీవ రూపాన్ని ఇస్తున్నారు. మహిళా ఉద్యమ పత్రికగా ‘మాతృక’ మొదలైన తరువాత మహిళా రచయిత్రులను కార్యకర్తల నుండే తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని పీవోడబ్ల్యూ కార్యవర్గం గుర్తించింది. మాతృకను గ్రామీణ శ్రామిక మహిళా సంచికగా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మాతృక శ్రామిక స్త్రీలను రచయిత్రులుగా మార్చగలగాలని మాతృక సంపాదకవర్గం తన ఆకాంక్షను వ్యక్తం చేసింది.
మహిళల్లో పని చేసే కార్యకర్తలు మహిళా జీవితాలను గనులుగా భావించి, అందునుండి ఎన్నో ఉదంతాలకు సజీవ రచనా భాష్యం ఇవ్వగలగాలి. ఉద్యమకేంద్రకంగా నడిచే పత్రికలు మహిళలకు సమాజంపై ఉన్న అసంతృప్తిని పనిలో పెట్టగలగాలి. మహిళకు మతానికీ, మహిళకూ రాజ్యానికి, మహిళకూ గుత్తపెట్టుబడికీ ఉన్న సంబంధం అర్థం చేయించే చూపు శ్రామిక మహిళా పత్రికలకు ఉండాలి. ఇంకా చెప్పాలంటే మాతృక పత్రికనే ఒక కార్యకర్తలాగా పని చేయించాలని అన్నారు.
ప్రగతిశీల, విప్లవ, మహిళా రచయిత్రులు, కవయిత్రులు భాగస్వామ్యంతో పాటు యితర ప్రగతిశీల రచయితలు, మేధావులు, మిత్రుల క్రియాశీల మద్దతు, ఆత్మీయ సహకారంతో ఇప్పటివరకు మాతృక పత్రిక నడిచింది. దానికి తోడు తన పాఠకులు, అభిమానులు, మహిళా వుద్యమకారుల నుండి తన స్వంత రచయిత్రులను అభివృద్ధి చేసుకునేందుకు సంపాదక వర్గం పలు దఫాలు ‘మాతృక రచయిత్రుల వర్క్ షాపులను’ నిర్వహించింది. దానికి కొనసాగింపుగానే మాతృక మరో వర్క్ షాప్ ను నవంబర్ 1,2 తేదీల్లో హైదరాబాదులో జరుపుతున్నాం. కధ, కవిత, వ్యాసం మొదలైన అంశాలకు సంబంధించిన మెలుకువలను అంది పుచ్చుకోవటానికి ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మీ క్రియాశీల ఆత్మీయ సహకారం మాతృకకూ, ఇప్పుడు జరపబోతున్న వర్క్ షాప్ కూ ఎంతో అవసరం. మీ అందరి సహాయ సహకారాలతో, ఉన్నత ప్రమాణాలు కలిగిన పాఠకులతో మాతృకను మరింత బాధ్యతతో ముందుకు నడిపించగలమని తెలియచేస్తున్నామని మాతృక సంపాదకవర్గం తమ బాధ్యతను తన కర్తవ్యాన్ని ప్రకటించింది.
