By KURA YADAIAH| October 23, 2025,
హిందు 9న్యూస్ డెస్క్
మద్య మానేరు ప్రాజెక్టులో సర్వం కోల్పోన నిర్వాసితుల దుఃఖానికి కొలతలు లేవు. ఎలుతున్నవారు ఇచ్చిన మాట నీటి మూటలవుతుంటే. ఆగమయితుంటే నిర్వాసితుల దుఃఖం అనంత. ఆ బతుకులవ్యధాల కు అక్షర రూపం ఇవ్వాల్సింది బాధ్యతను మరోసారి కథనం గుర్తు చేసింది….
(అల్లే రమేష్ జర్నలిస్టు)
అప్పుడే సూర్యుడు నిద్రలేసినట్టు ఉన్నడు చీకట్లు తొలగిపోతూ మెల్లగా వెలుగులు పరుచుకుంటున్నాయి. రాజవ్వ వంట చేసే పనిలో పడ్డది కొడుకు ఇంకా లెవ్వలేదు. గబగబ వంట పని పూర్తిచేసి సద్ది కట్టుకుని ప్లాస్టిక్ కవర్ లో సదిరి ఇంట్ల కేల్లి బయట పడ్డది. అన్ని కొత్త ఇండ్లు కాలనీలో సీసీ రోడ్లు ఎక్కువ బంగ్లాలే ఉన్నయి. బంగళా లా వెనుక బతుకుల్లో ఎంత దుఖం ఉన్నదో ఎవ్వరికీ ఎరుక మనసులోనే అనుకుంది రాజావ్వ . వడివడిగా నడుస్తూ ముందుకు సాగుతుంది రాజవ్వ. ఆటో ఎత్తిపోతే ఎట్ల అని రంది, ఓ దిక్కు మనసుల కలవర పెడుతూనే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆటో దగ్గర ఊరి ఆడోళ్ళు బాగానే మంది జమై ఉన్నారు. గబగబ నడక ముందుకు సాగుతుంది. ఒక్కొక్కరుగా అందరూ ఆటో ఎక్కిండ్రు. ఇరికిరిగి కూసున్న ఆటోలో మెల్లగా 18 మందికి పైగా కూసున్నరు. ముగ్గురు నలుగురు బయటే ఉండిపోవడంతో ఈ రోజుకు కైకిలి లేనట్టే అనుకొ ని తిరిగి వెనక్కి వెళ్తున్నరు. ఆటో ముందకు కదిలింది. మెల్లగా ఆటో పెద్ద రోడ్డు ఎక్కింది. ఒక దిక్కు కొదురుపాక కొత్తకాలనీలో కట్టిన ఇండ్లను దాటుకొని కరీంనగర్ దిక్కు ఆటో పరుగులు పెడుతుంది. వెంకట్రావుపల్లె నుంచి మనువడా ఉర్ల్లోంచి ఇల్లంతకుంట వైపు ఆటో సాగుతోంది. మూల మలుపు నుండి మిడ్ మానేరు కట్ట ఆటోతో పాటే తమను వెంటాడుతూ వస్తున్నట్లే అనిపించింది. మెల్లగా రాజవ్వ ఆలోచనలన్నీ గతంలోకి పో యినయి.
ఎప్పుడు గిసోంటి రోజు ఒకటి వస్తదని రాజవ్వ కలలో కూడా అనుకోలే. కొదురుపాకలో 4 ఎకరాల భూమిలో సాగు చేసుకుంట ఉన్న రోజులు కండ్ల ముందే కదలాడినై. దేనికి కరువు లేకుంట బతికిన రోజులు . తానే నాలుగురికి పనిచ్చేది. పత్తి ఏరడానికి సిరిసిల్ల నుంచి కూడా ఆటోల్లో తమ దగ్గరికి వచ్చిన రోజులు యాది కొచ్చినయి. ఇట్ల పరిపరి విధాల ఆలోచనలను రాజవ్వను మనసున పట్టకుండా చేస్తున్నయి. అప్పుడు ఊరు ఊరులెక్క ఉంటుండే. ఊరు నిండా ఉన్నోళ్ళకు ఏదో ఒక్క తెరువు ఉండనే ఉండే. చిన్న చిన్న సమస్యలు మినహ పెద్దగా తమ చుట్టుపక్కలోల్లు కూడా తిప్పలు పడ్డది తాను చూడలేదు. పక్కపొంటి ములవాగును కలుపుకుని పొయ్యి మానేరు వాగు ఎన్నాడు కరువును ఊరి దారిచెరనియ్యలే.యవుసానికి ఎటువంటి కష్టాలు లేకుండే. ఇంటిల్లిపాదికి భూమి ఎంత నమ్మకాన్ని ఇచ్చింది తనలో తానే అనుకుంది రాజవ్వ. మెల్లగా ఆటో పొత్తురు బ్రిడ్జిపై నుంచి పోతుంటే మల్లోసారి డ్యాం దిక్కు చూసింది. సముద్రాన్ని దోసిల్లో పట్టుకున్నట్లు కనిపించిన మానేరు డ్యాం. ఆ నీళ్ళల్లో మునిగిపోయిన తమ బతుకులే ఎందుకో మళ్ళీ మళ్ళీ రాజవ్వకు యాదికొస్తున్నయి. ముంపులో పోయిన భూమికి ఇచ్చిన పైసలు ఇళ్ళుకు ఇచ్చిన పైసలు అన్ని హారతి కర్పూరంలా కరిగిపోగా ఇప్పుడు కొదురుపాక ఆర్ అండ్ అర్ కాలనీలో కట్టుకున్న ఇళ్ళు, మిగిలిన అప్పుల విషయం రాజవ్వను కలవర పెడుతున్నై. పెళ్ళి చేసుకున్న పెద్ద కొడుకు కోడలితోని వేరుగా ఉంటున్నడు. చిన్నోనికి లగ్గం చేద్దమంటే చేతిలో పని లేకపాయె. సదువుకున్నా నౌకరు లేకపాయె. ఎప్పుడన్నా ఏదన్నా పని దొరికితే పోతుండు వస్తుండు. వాన్ని ఏమన్నా అంటే ఏం చేసుకుంటడో అని రాజవ్వకు మనసులో ఓ దిక్కు భయం. వాన్ని కూడా అనేతందుకు ఏముంది రాతనే సక్కగా లేకపాయే రాత రాసినోని ఇంట్ల పినుగెళ్ళ అనీ తననుతాను మనుసులనే తిట్టుకుంది. ఇట్లామనసులో గతమంతా సుడులు తిరుగుతుంది ఎందరికో పనిఇచ్చిన తన లాంటి రైతు కుటుంబాలు ఇప్పుడు కూలి పనుల కోసం ఆటోలు పట్టుకుని బెజ్జంకి దాకా వ్యవసాయ పనుల కోసం ఉర్లపొంటి పోవాల్సి రావట్టే భూములు తీసుకునేటప్పుడు కండ్లాల్ల పెట్టుకుంటాను దండాలుపెట్టీ చెప్పినోల్లు ఇటూ దిక్కు కనీసం తొంగి చూసిన పాపాన పోలేదు..బతుకులను గంగాపాలుచేసిరి. బతుకుటా నికి తోవ్వా అయినా సుపియ్యకపోయిరి. ఆటో కంధికట్కురు దాటి ముందుకూ పోతుంది.వలంపట్ల శివారులో మఱ్ఱి చెట్టు పక్కకు ఆటో ఆగింది.ఒక్కొక్కరు అటో దిగుతున్నారు.రాజవ్వ అటో దిగింది. నాట్లేసెందుకు అందరి తో పాటు తాను పొలంలో అడుగుపెట్టింది. కాళ్లకు తాకిన మట్టి తో పెనవేసుకున్న నీళ్ళు.కనిపించకుండా రాజవ్వ కొండంత దుఖాన్ని గుండెలో దాచుకుని నాట్లెసే పనిలో మునిగి పోయింది...
( మధ్య మానెరూ ప్రాజెక్ట్ లో సర్వస్వన్ని పోగొట్టుకుని తెరువు కోసం తండ్లడుతున్న నిర్వాసితుల రాజవ్వల దుఖం కలవరా పెడుతుంటే…)
అల్లే రమేష్, జర్నలిస్ట్, సిరిసిల్ల
సెల్.9030391963.
