కవిత, సాహిత్యం
K, Yadaiah| August 18,2025,

రమేష్ నాస్తిక్,
*ఇంకా చాలు ఆపండి…
ఎప్పుడైనా
ఒకరి చేతిలో చీపురూ, మలం మట్టితో నిండిన
బకెట్టునో డబ్బానో చూసినప్పుడు
నా నరనరాల్లో
వేల సంవత్సరాల వేదనలు ఒకేసారి
అగ్నిజ్వాలలా మండటం మొదలవుతుంది
ఈ భూమిమీద వ్యాపించి ఉన్న
చల్లని ఇసుకరేణువుల్లా
నా అరచేతులు చెమటతో తడిసి ముద్దవుతుంటాయి
నా కళ్లలో దిగివస్తుంది
చరిత్ర తాలూకా నల్లని చీకటి
దాని ఆత్మహంతక కపటత్వంతో కలసి
చీపురు పట్టిన చేతుల సర్రుసర్రనే శబ్దం
జనసమూహం మధ్య స్పష్టంగా వినిపిస్తుంది
ఒంటరి అరణ్యంలో గుసగుసలాడే గాలిలా
ఆ సంవత్సరాలన్నీ
వలయాల్లా తిరుగుతూనే ఉంటాయి
ఎడతెగకుండా నను పొడుస్తూనే ఉంటాయి
వేళ్లనూ, అరచేతులను
ప్రతి నరంలోనూ చేరిపోతూ చల్లని వేడిలా
లోతైన రాతికొండల నదిలో
అసంఖ్యాకమైన మూగ వేదనలు
తమను వ్యక్త పరచడానికి
ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి
చాలు!
మౌనంగా ఉండటం
ఇక చాలించండీ
అర్థరహితంగా పడి ఉన్న రాళ్లు
ఇప్పటినుంచి బాధితుల చేతిలో ఆయుధాలవుతాయి!
ఇప్పుడవి ఉపయుక్తమవుతాయి
వేదనతో కరిగిపోయిన ప్రజలకోసం..
