డిసెంబర్ 25 వ తేది. డా,, అంబేద్కర్ మను ధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేసిన రోజు. ఈ రోజునే మా ప్రియతమ నాయకుడు మారోజు వీరన్న CPUSI (DBSV)ని ఏర్పాటు చేసిన రోజు. ఈ రోజునే మారోజు వీరన్న ఆలోచనా పరులముగా మేము తీసుకున్న సరికొత్త నిర్ణయాన్ని మీ ముందుకు పెడుతున్నాము. కులం పేరిట, ప్రకటిత కుల పార్టీల ఏర్పాటును ప్రకటిస్తున్నాం. అయితే ఈ సందర్బంగా పాత ప్రశ్నలే మళ్ళీ వస్తాయి. వీరన్న కుల సంఘాలు పెట్టినప్పుడు వచ్చినప్పుడు ఎదురయిన ప్రశ్నలు మళ్ళీ వస్తాయి. వాటికి వీరన్న చెప్పిన జవాబులే మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది.
వీటిలో మొదటి ప్రశ్న 1) ” కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతిని గాని నిర్మించలేం” అంబేత్కర్ సూక్తిని అడ్డం వేస్తారు. దానికి వీరన్న చెప్పిన సమాధానం, అంబేద్కర్ చెప్పింది నూటికి నూరు పాళ్ళు సత్యం. అయితే ముల్లుని ముల్లుతోనే తీయాల్సివుందనేది మరిచిపోవద్దు. కుల అడ్డుగోడలు కూల్చడానికి, గోడను గుర్తించాలి. లేదు అంటే అడ్డు గోడ కూలిపోదు. 2) కుల సంఘం పెడితే కులం బలపడుతుందనే వాదన తెస్తారు. కుల వాటా కోసం కుల సంఘం పెట్టక పోతే కుల వాటా కోసం పోరాడే సంస్థ ఏది. 3) కులం సంఘం పెడితే ఉద్యమాలు చీలి పోతాయినే వాదన. ఉద్యమాలు చీలిక శాస్త్రియమైన ఉద్యమ పంథా లేకపోవడం వల్లనే. 4) కుల నిర్మూలన ఎలా. కుల అసమానతలు ఉన్నంత కాలం నిర్మూలన సాధ్యం కాదు. కులాల సమానత్వ సాధన కుల నిర్మూలన కు ముందు షరతు. కుల సమానత్వ సాధన విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో వాటా సాధనతో ముడి వడి ఉంటుంది. కుల వాటా సాధనకై కుల సంఘం తప్పనిసరి అవుతుంది.
ఈ అవగాహనతోనే సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట మారోజు వీరన్న, విప్లవోద్యమం ఎదురుకుంటున్న సంక్షోబాన్ని అర్థం చేసుకుని పరిష్కారంగా కుల సంఘాల ఏర్పాటుకు పూనుకున్నాడు.నాడు ఒక్కసారిగా భూకంపం వచ్చిన విధంగా నిచ్చెన మెట్ల మనువాద వ్యవస్థ కంపించిపోయింది. అయితే 1999 మే 16న సీమాంధ్ర పాలక రాజ్యం మారోజు వీరన్నను బలి తీసుకుని ఆ ప్రయోగాన్ని అణచివేసింది. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ కాలం, మా జీవితకాలపు కృషి… ఒక తరం జీవిత కాలం పోరాటంలో ఎన్నో జయాపజయాలని ఎదుర్కొన్నం. నీలాప నిందలను భరించినం. కుల సంఘాల ఏర్పాటు తప్పుడు నిర్ణయమని మమ్మల్ని ఎంతగానో విమర్శించినా మౌనంగా మా పని మేము చేసుకుంటూ వచ్చినం. అయితే కుల పోరాటంలో నాడు కుల సంఘాల ఏర్పాటు ఒక మొదటి అడుగు మాత్రమే. నేడు మరో ముందడుగు వేస్తున్నాం. కుల దామాషా రాజకీయ వాటా కోసం కుల రాజకీయ పార్టీల ఏర్పాటుకు నిర్ణయించుకున్నాం. బీసీ రిజర్వేషన్ కోసం నవంబర్ 28న ప్రారంభమైన ఆమరణ దీక్షను సంచార నిరాహార దీక్షగా మార్చుకొని డిసెంబర్ 16న నేను దీక్ష విరమించిన రోజున నా మాదిగ సోదరులు మాదిగ రాజ్యాధికార పార్టీని ప్రకటించుకోవడం జరిగింది.
ఉద్యమ రంగంలో ఏదైనా కొత్త మార్పు తీసుకున్నప్పుడు మార్పును జీర్ణం చేసుకోలేని వారు సహజంగానే వ్యతిరేకిస్తారు. మొరాయిస్తారు. దాడి చేసే వారు కూడా ఉంటారు. అర్థం చేసుకుని అభినందించే వారు తక్కువే ఉంటారు. బాయిలో పడిన వ్యక్తి పైకి ఎక్కడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఇది చేయకూడదు అది చేయకూడదని సుద్దులు చెప్పేవారు ఎల్లప్పుడూ ఉంటారు. అటువంటి వారి మాటలు పట్టించుకుంటే ఎప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే అగ్రకుల పార్టీలు, పార్టీల వారీగా కులాన్ని ముక్కలు చేయడంలో వీరికి ఇబ్బంది ఏమీ కనపడదు. ముక్కలైన కులం నిర్మూలన అవుతుందని వీరు అనుకుంటారు. అది నిజం కాదు. కేవలం అగ్రకులాధిపత్యం కోసమే కులాన్ని ముక్కలు చేయడం కులాన్ని బలహీనం చేస్తారు. ముక్కలైన కులం దామాషా వాటా డిమాండ్ చేసే శక్తిని కోల్పోతుంది.
మారోజు వీరన్న కుల నిర్మూలనకు ముందు షరతు కులాల సమానత్వం కావాలన్నాడు. కులాల సమానత్వం కోసం జరిగే పోరాటం కుల ప్రాతిపదికనే జరుగాలన్నాడు. అయితే అసలైన కులపోరాటం రాజకీయ రంగంలోనే ఉంటుంది. కుల జనాభా దామాషా రాజకీయ వాట సాధనకు కుల సంఘాల నిర్మాణం సరిపోదని కుల రాజకీయ పార్టీలు ఏర్పాటు తప్పనిసరి గుర్తించడానికి మాకు ముప్పై ఏళ్ల జీవితకాలం పట్టింది. ఒక రాజకీయ పార్టీని ఒక అగ్రకుల వ్యక్తులు ఏర్పాటు చేసినప్పుడు అంగీకరించే బహుజన సమాజం, అదే బహుజన వ్యక్తులు కులాతీతంగా ఏర్పాటు చేసే పార్టీలను అంగీకరించడం లేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలే నరేంద్ర, కాసాని జ్ఞానేశ్వర్, దేవేందర్ గౌడ్… ఎంతో మంది యోధాను యోధులు కులాతీతంగా పార్టీలు ఏర్పాటు చేస్తే ఇతర కులాల ప్రజలు వారిని స్వంతం చేసుకోలేదు. వారి స్వంత కులం పట్టించుకోలేదు. అదే క్రమంలో మందకృష్ణ మాదిగ, విశారదన్ నేడు తీన్మార్ మల్లన్న వరకు పార్టీలు పెట్టి బలపడడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉంటాడో ఆ కులం వారే అక్కడ సమీకరించ బడుతారు. మిగతా కులాలు ఆ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించలేవు. అందువల్ల అది అప్రకటిత కుల పార్టీ గా ఉంటుంది. ప్రకటిత కుల సంఘాల స్థాయికి వచ్చిన తెలంగాణ సమాజంలో అప్రకటిత కుల పార్టీలు కూడా బలపడలేవు. కులమున్న సమాజంలో కుల ప్రాతిపదికనే బలమైన సమీకరణ, నిర్మాణాలు సాధ్యమవుతాయి. దీన్ని పట్టించుకోకుండా సమీకరించుకునే ప్రయత్నం “అంగట్లో పోయి అమ్మ అంటే ఎవనికి పుట్టినవు బిడ్డ” అన్నట్టు ఉంటుంది.
ఇక సంఘాలు పెట్టే వారంతా రాజకీయ పార్టీ పెట్టడం అంటే మాత్రం డబ్బు ఉండాలి అనే వాదన ముందుకు తెస్తారు. మరి డబ్బున్నవాడు ఇప్పుడున్న పార్టీల్లో సీట్లు, ఓట్లు కొంటాడు తప్ప రాజకీయ పార్టీలు పెట్టే సాహసం చేయడు. వారికి అంత రిస్కు కూడా అవసరం లేదు కదా. ఆ విధంగా రాజకీయ రంగాన్ని అగ్రకుల ధనవంతులకు వదిలేసి ఎన్ని సంఘాలు పెట్టినా సాధించేది ఏమి లేదు. సంఘాలతో కుల రాజకీయవాట ఎన్నటికైనా సాధ్యమవుతుందా ఆలోచించుకోవాల్సిన విషయం కదా. సామాజిక రంగాలలో వాటా సాధన రాజకీయ రంగంలో వాటా సాధన ముడిపడి ఉన్న అంశం. కనుక రాజకీయ రంగంలో కుల జనాభా దామాషా వాటా సాధన యుద్ధం జరపాలంటే కుల రాజకీయ పార్టీ స్థాపన తప్పనిసరి అవుతుంది.
కుల రాజకీయ పార్టీల ఏర్పాటుతో సమాజం చీలిపోతుంది కానీ అనే వాదన కూడా ముందుకు వస్తుంది. అగ్రకుల పార్టీలు సమాజాన్ని చీల్చి వారి ఎన్నికల గెలుపు కోసం అవసరార్ధ అలయన్స్ కట్టి బహుజన సమాజపు నెత్తిమీద నాట్యం ఆడుతున్నాయి. వీరి ఆటలు కట్టించడానికి కులమే బలమైన సమీకరణ ఆయుధం. కుల పార్టీలు ఏర్పాటు చేసుకుని సామాజిక న్యాయం “మేమెంత మందిమో, మాకంత వాటా ” ఇరుసుగా ఆలయన్స్ ఏర్పడాల్సి ఉంటుంది. ఏ కులం వారు ఆ కులం పార్టీకి ఓటు వేసుకుంటే అగ్రకుల పార్టీలకు మిగిలే ఓటు శాతం చాలా తక్కువ. రెడ్డి పార్టీకి మూడు శాతం, వెలమ పార్టీకి పాయింటు ఐదు శాతం గా ఉంటుంది. ఈ ఆలోచనతోనే 1) మాదిగ రాజ్యాధికార పార్టీ తో ప్రారంభమై 2)ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ 3) గౌడ రాజ్యాధికార పార్టీ 4) పద్మశాలి రాజ్యాధికార పార్టీ 5) మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ 6) యాదవ రాజ్యాధికార పార్టీ…తదిత పార్టీల ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాం. ఐడెంటిటీ ఆలయన్స్ సూత్రం అదారంగా కుల రాజకీయ పార్టీలు తమ కులాన్ని రాజకీయంగా బలపరుచుకుంటూ సోషల్ జస్టిస్ ఆలయన్స్ గా ఒక్కటి కావాల్సి ఉంటుందని అవగాహనతో కుల రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం.
ఉద్యమ నమస్కారాలతో…
బత్తుల సిద్దేశ్వర పటేల్
బీసీ ఆజాది
9704672813