భారత రాజ్యాంగం మీద దౌర్జన్య పూరిత దాడి.! ప్రబాత్ పట్నాయక్

author
0 minutes, 2 seconds Read

ముఖ్యంశాలు 

Kura Yadaiah| December 31,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :-

 భారత రాజ్యాంగం మీద దౌర్జన్యపూరిత దాడి..!

———— ప్రభాత్‌ పట్నాయక్

Reding :-

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కన్నా ముందు వివిధ రాష్ట్రాల్లో చాలా రకాల ఉపాధి పథకాలు అమలు అవుతూ వుండేవి. అయితే అవి చాలా పరిమితంగా ఉండేవి. వాటికి ఆర్థిక వనరుల లేమి కూడా ఉండేది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లో వచ్చినప్పుడు అది దేశమంతటా ఒకే విధంగా అమలు జరిగేలా, ఉపాధి అవసరమైన వారికందరికీ వర్తించేలా రూపొందింది. దానికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్రం వహించింది. ప్రతీ ఇంటికీ ఒకరికి ఏడాదిలో కనీసం 100 రోజులు పని దొరికేలా ఈ పథకం రూపొందింది.

ఒకవేళ అలా పని చూపలేకపోతే, పని కల్పించాలని కోరిన వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి. ఇలా కోరినవారికందరికీ పని ఒక హక్కుగా కల్పించే పథకం రూపొందింది. ప్రజలకు పని ఒక హక్కుగా ఈ పథకం ప్రవేశపెట్టింది. భారత రాజ్యాంగం ఆర్థిక హక్కులను ప్రాథమిక హక్కులుగా కాక, ఆదేశ సూత్రాలలో చేర్చింది. వాటిని ఆచరించే దిశగా నడవాలని మాత్రం ప్రభుత్వాలను నిర్దేశించింది. ఉపాధి హామీ పథకం ఈ లోపాన్ని సరిదిద్ది, పాక్షికంగానైనా, రాజ్యాంగం దార్శనికతకు అనుగుణంగా ముందడుగు వేసింది.

ఈ ఉపాధి హామీ పథకం గురించి నెలల తరబడి బహిరంగ వేదికల మీద చర్చలు నడిచాయి.ఒక పార్లమెంటరీ కమిటీ అనేక తరగతుల ప్రజలనుండి అభిప్రాయాలను స్వీకరించింది.చివరికి అనేక అంశాలమీద ఏకాభిప్రాయం కుదిరాక ఈ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.ఆ విధంగా ఈ చట్టం మన దేశ ప్రజల దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబించింది. రాజ్యాంగం ఊహించిన ఒక హక్కును ప్రజలకు వాస్తవంగా కల్పించింది.ఇటువంటి చట్టాన్ని రద్దు చేయడం అంటే అది రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడమే ఔతుంది. సాంకేతికపరంగా కాకపోవచ్చు కాని రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినది స్వయంగా ఎన్డీయే ప్రభుత్వమే!

పార్లమెంటులో మూజువాణి ఓటు ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించి ఏకంగా ప్రజలకు సంక్రమించిన ఒక హక్కునే కాలరాసింది. ఇది పూర్తిగా దౌర్జన్యపూరిత చర్య. తాను పూనుకుంటున్నది ఎంతటి అనుచితమైన చర్యో కేంద్రానికి గ్రహింపు ఉన్నట్టుంది. అందుకే గుట్టుచప్పుడు కాని పద్ధతిలో డిసెంబర్‌ 15న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం స్థానంలో మరొక చట్టాన్ని ప్రతిపాదించింది.17వ తేదీ రాత్రి దానిమీద చర్చించింది. 18న మూజువాణి ఓటుతో దానిని ఆమోదించింది. కనీసం పార్లమెంటరీ కమిటీకి కూడా నివేదించడానికి అంగీకరించలేదు. నిజానికి గ్రామీణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌ అలా నివేదించమని రాతపూర్వకంగా కోరారు కూడా. కాని దానిని తిరస్కరించింది ప్రభుత్వం.

పైగా ఆ బిల్లుకు ఎటువంటి సవరణలూ ప్రతిపాదించడానికి కూడా అనుమతించలేదు. ఇది చాలా ఆశ్చర్యకరం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద పెద్ద దాడి. దీనిని బట్టి చూస్తే ప్రజలకు సంబంధించి ఎటువంటి హక్కునైనా, అది రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించినా, దానిని ఏ క్షణంలోనైనా పార్లమెంటులో ఒక మూజువాణి ఓటుతో రద్దు చేసేయవచ్చు అన్నమాట! ఎంత అన్యాయం!

తనదైన శైలిలో ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త చట్టంలో ఉన్న అంశాల గురించి సాధ్యమైనంత గందరగోళాన్ని సృష్టించే పనిలో రాత్రీపగలూ తలమునకలై వుంది. కొత్త చట్టం ఏడాదికి 125 రోజులు పని కల్పించే విధంగా రూపొందింది కనుక ఇది మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కన్నా గొప్పది అని చెప్పుకుంటోంది. ఈ 25 రోజుల పని అనేది మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కల్పించిన 100 రోజులకి అదనంగా కాదు. అందులో పని కల్పించమని కోరిన వారందరికీ పని ఒక హక్కుగా కల్పించారు.ఇప్పుడు కొత్త చట్టంలో పని కల్పించడం అనేది కేంద్ర ప్రభుత్వపు హక్కుగా మారిపోయింది.ఇప్పుడు పని కల్పించాలా వద్దా అన్నది కేంద్రం ఇష్టం.

మొదటిది: ఇంతవరకూ గ్రామీణ భారతంలో ఎక్కడ ఉన్నవారికైనా కోరితే పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కొత్త చట్టం ప్రకారం కేంద్రం ఎంచుకున్న కొన్ని ప్రాంతాలలో మాత్రమే పని కల్పిస్తారు.అంటే ప్రతీ గ్రామీణ కుటుంబానికీ కనీసం ఒక 100 రోజుల పాటు పని కల్పించాలన్న నియమం ఇప్పుడు ఎగిరిపోయింది. అందుచేత అదనంగా మరో 25 రోజలు కల్పించడం అన్న ప్రసక్తి ఎక్కడుంటుంది? ఆ 100 రోజుల పనికే దిక్కు లేకుండా చేశారు.

రెండవది: కొత్త పథకం ప్రకారం రాష్ట్రాలకు ఎంతెంత నిధులు ఇవ్వాలన్నది కేంద్రం నిర్ణయిస్తుంది.అంతే తప్ప పాత చట్టంలో మాదిరిగా ఏ రాష్ట్రంలో ఎంతమంది పనులు కల్పించాలని కోరితే అందరికీ నిధులు ఇచ్చే ప్రసక్తి లేనే లేదు.

మూడవది: ఇప్పుడు రాష్ట్రాలు 40 శాతం నిధులు ఇస్తే ఆ తర్వాత కేంద్రం 60 శాతం నిధులను మంజూరు చేస్తుంది. పాత చట్టంలో 90 శాతం నిధులను కేంద్రం భరించేది. పైగా ఎంత మొత్తంలో నిధులు ఇవ్వాలన్నది ఎందరు పనులు కల్పించాలని కోరారు అన్నదానిని బట్టి ఉండేది.ఇప్పుడు అలా కాదు. ఉదాహరణకి ఒక రాష్ట్రం తన దగ్గర నిధుల కొరత ఉన్న కారణంగా, తాను కల్పించాల్సిన రూ.40కి బదులు రూ.20 మాత్రమే అందించ గలిగిందనుకోండి. అప్పుడు కేంద్రం ఇచ్చేది కూడా రూ.60కి బదులు వెంటనే రూ.30కి తగ్గిపోతుంది.

అంటే సగానికి సగం ఎగిరిపోయిందన్నమాట. ఇది పథకాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుంది.అంతేకాదు, ఇప్పుడు కేంద్రం తప్పుకోడానికి ఓ సాకు దొరికింది. రాష్ట్రం కేటాయించవలసిన వాటా కేటాయించలేక పోయింది కనుక తానూ మంజూరు చేయడం సాధ్యపడలేదని చెప్పి తప్పంతా రాష్ట్రం మీదకే నెట్టేయవచ్చు. అందుచేత పని రోజులను 125కి పెంచినట్టు చెప్పుకోవడంలో అర్ధం లేదు. కొత్త పథకం పని కావాలని కోరుకున్నవారందరికీ పని గ్యారంటీ చేసేది కాదు. పాత చట్టం ఒక హక్కుగా కల్పించిన దానిని ఈ కొత్త చట్టం రద్దు చేస్తోంది.

ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగం మీద చేస్తోన్న దాడి కేవలం ఒక హక్కును రద్దు చేయడానికే పరిమితం కాలేదు. అది ఫెడరలిజం మీద కూడా దాడి చేస్తోంది. రాష్ట్రాలన్నీ ఆర్థిక వనరుల కొరతతో ఇబ్బందులు పడుతున్న సంగతి కేంద్రానికి బాగా తెలుసు. కాని, ఉన్నట్టుండి ఊడిపడ్డట్టుగా, రాష్ట్రాలను ఏమాత్రమూ ముందుగా సంప్రదించకుండానే, ఏకపక్షంగా రాష్ట్రాల వాటాను ఏకంగా 40 శాతానికి పెంచేసింది! ఇంతవరకూ అది 10 శాతం మాత్రమే ఉండేది. అంతేకాదు, ఏ రాష్ట్రంలో ఈ పథకం కింద ఎంత ఖర్చు చేయాలో అది కూడా ఇప్పుడు కేంద్రమే నిర్ణయించబోతోంది.

కేంద్రం నిర్దేశించినదానికన్నా ఎక్కువగా ఖర్చు చేయాలని ఏ రాష్ట్రమైనా అనుకుంటే దానికి కూడా కేంద్ర అనుమతి కావలసిందే.అంటే ఉన్నట్టుండి రాష్ట్రాలు అదనంగా ఖర్చు భరించాల్సి వస్తోంది. అంతేగాక, ఈ పథకానికి సంబంధించి కేంద్రం నిర్ణయించినట్టుగా మాత్రమే రాష్ట్రాలు ఖర్చు చేయాలి. అంటే రాష్ట్రాలకు ఇక ఏ స్వంత ప్రతిపత్తీ లేదన్నమాట. అవి కేవలం కేంద్రానికి లొంగివుండే సామంతుల మాదిరిగా నడుచుకోవాలన్నమాట. ఫెడరలిజం గురించి రాజ్యాంగం నిర్దేశించినదానికి ఇది పూర్తి విరుద్ధం.

రాష్ట్రాల పాత్ర మాత్రమే కాదు, స్థానిక సంస్థల పాత్రను కూడా కొత్త చట్టం కుదించి వేస్తోంది. ఇంతవరకూ పాత చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులను స్థానిక సంస్థలు ప్లాను చేసేవి. ఇప్పుడు ఎలా చేయాలో వాటిని కేంద్రమే ఆదేశించబోతోంది. ఇది 73వ రాజ్యాంగ సవరణ రూపొందించిన ప్రజాస్వామిక వికేంద్రీకరణకు పూర్తి విరుద్ధం.

దేశంలో కడుపేదలు గ్రామాల్లోనే ఉన్నారు.వారి మీద ఈ కొత్త చట్టం రూపంలో దాడి జరుగుతోంది. అంతేగాక భారత రాజ్యాంగం మీద బహుముఖ దాడిగా ఇది జరుగుతోంది. పేదలమీద జరిగే ఈ దాడి ప్రభావం స్పష్టమే. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామాల్లో లక్షలాది మంది పేదల ప్రాణాలను నిలబెట్టిన పథకం. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి కాలంలో వేలాదిమంది వలస కార్మికులు పనులను పోగొట్టుకుని గ్రామాలకు ఈసురోమంటూ కాలినడకను చేరుకున్నప్పుడు వారు ఆ గ్రామాల్లో బతకగలిగారంటే కేవలం అది ఈ పాత చట్టం వల్లే. అటువంటి చట్టం కల్పించిన హక్కు మీద ఇప్పుడు దాడి చేయడం అంటే అది మొత్తం రాజ్యాంగం మీద దాడి చేయడమే.

పాత చట్టం రద్దు అవడంతో ఇంతవరకూ తమకు హక్కు ఉందన్న ఆత్మగౌరవంతో బతికిన గ్రామీణ పేదలు ఇకముందు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద అడుక్కునేవారి మాదిరిగా ఆధారపడాలన్నమాట. వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా మారిపోతే అప్పుడు బహుశా కేంద్రం ముందుకువచ్చి వారికేదో కొంత సాయం చేయవచ్చు. అది కూడా నరేంద్ర మోడీ గారి ఫొటోలతో. ఏం చేసినా ఆ పేదల పరిస్థితి పాతచట్టం ఉన్నప్పుడు మాదిరిగా ఇకముందు ఉండదు కదా.

పైగా ఈ దిగజారిన పరిస్థితికి వారంతా నరేంద్ర మోడీ గారికి రుణపడి వుండాలన్నమాట! ఇలా పౌరుల్ని ముష్టివాళ్ళ స్థితికి దిగజార్చడం అనేది అన్ని ఫాసిస్టు మూకల అంతిమ లక్ష్యంగా ఉండేదే. ఎందుకంటే వాళ్ళు ఒక మహా నేతను సృష్టించి అతడినే ఆరాధిస్తూ ప్రజలంతా బతకాలని కోరుకుంటారు. మరి ముష్టివాళ్ళు అయినప్పుడే కదా ఆ మహా నేతను ప్రజలు దేబిరించి ‘మహాప్రభూ’ అంటూ అడుక్కునేది?

రాజ్యాంగం మీద దాడి కూడా ఈ క్రమంలో అంతర్భాగమే. మన రాజ్యాంగం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుండి వచ్చింది. అది ప్రజలు ఈ దేశానికి సర్వాధికారులు అని పేర్కొంది. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజలకే సేవ చేయాల్సి వుంది. కాని ఫాసిస్టులు ఆ ప్రజలే తమ నాయకుడికి సేవ చేసేవారిగా ఉండాలని కోరుకుంటారు. అతడినే మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటూ వుండాలని కూడా కోరుకుంటూ వుంటారు.

అది జరగాలంటే ప్రజలకున్న హక్కులన్నీ ఒక్కొక్కటిగా రద్దవుతూ వుండాలి. ఏ హక్కులూ లేకుండా ప్రజలందరూ తమ మహా నేతను కొద్దిపాటి దయ చూపమని ప్రాధేయపడుతూ వుండాలి. ఈ విధంగా జరగాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి నియంతృత్వ దశగా మారాలంటే, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం అందులో ఒక భాగమే. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి పథకాన్ని రద్దు చేయడం అనేది ఈ దిశగా పడిన ఒక పెద్ద ముందడుగు!

( స్వేచ్ఛానుసరణ )

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *