రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన- హిందు బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ పటేల్

లేఖ

Kura Yadaiah |November 15,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :

Reading :

మై డియర్ రాహుల్ జి..

బిహార్ ఎన్నికల్లో మీ ఓటమి తర్వాత తప్పనిసరయి ఈ లేఖ రాస్తున్నాను. మిత్రమా! రాజకీయాలలో నేనున్నాను అనిపించుకుంటే సరిపోదు, ఛాంపియన్ కావాలి. దేశంలో హిందుత్వ సిద్ధాంత పునాదిగా ఆర్ఎస్ఎస్ అండతో నడుస్తున్న బీజేపీ పార్టీ, దాని నాయకత్వం మోడీ-అమిత్ షా మధ్యన మిమ్మల్ని చూస్తే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు లాగా కనిపిస్తున్నారు. మీ పరిస్థితి చూస్తే సానుభూతి, జాలి కలుగుతుంది. ఇంకో వైపు మీ పార్టీలో మీ చుట్టూ ఉన్న శకుని మామల వల్ల, మీ కుటుంబ నేపద్యం వల్ల, భద్రత వలయాలు ఇవన్నీ కలిసి మావంటి సామాజిక ఉద్యమ కార్యకర్తలు మీకు సలహా ఇచ్చే అవకాశం ఉండదు. మేము సామాజిక ఉద్యమకారులుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే మరిన్ని రాజకీయ పార్టీలు పుట్టాలని కోరుకుంటాం. కానీ ఉన్న పార్టీలే సంక్షోభంలో కూరుకు పోతుంటే… దేశంలో మరో పార్టీ పుడుతుందా అని అనుమానం వస్తుంది. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే… దేశాన్ని ఏలుతున్న పార్టీ బీజేపీ తప్ప మరో పార్టీ ఏది నిలబడని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో పాలక పార్టీకి కనీసం ఒక బలమైన ప్రత్యర్థి ఉండాలని కోరుకుంటాం. అదైనా ఉంటుందా అనేది బిహార్ ఎన్నికల తర్వాత దేశం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి.
రాహుల్ గాంధీజీ బీసీల పట్ల గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై క్షమాపణ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో కుల గణన మరియు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు తెలంగాణ బీసీ సమాజానికి హామీ ఇచ్చారు. కులగణన, ఎవరెంతో వారికి అంత వాటా, రిజర్వేషన్ పై 50% సీలింగ్ ఎత్తివేత లాంటి అనేక అంశాలు మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దేశాన్ని రక్షించే సైన్యంపై కూడా 10% ఉన్న అగ్రకులాల పెత్తనమే నడుస్తుందనే వాస్తవాన్ని ధైర్యంగా చాటారు.

మీ వ్యక్తిత్వాన్ని చూసే తెలంగాణలో బీసీ సమాజం బీఆర్ఎస్ ను ఓడించి మీ పార్టీని గెలిపించింది,

ఇలాంటి మీ వ్యక్తిత్వాన్ని చూసే తెలంగాణ బీసీ సమాజం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని ఓడించి మీ పార్టీని గెలిపించుకున్నది. మీ ఆలోచనకు భిన్నంగా మీ రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. “వాగు దాటేదాకా ఓడ మల్లయ్య వాగు దాటినంక బోడ మల్లయ్య అన్నట్టు” మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి వుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ బీసీ సమాజాన్ని అడుగడుగునా వంచిస్తూ వచ్చింది. రెడ్డి రాజ్యాన్ని నెలకొల్పింది. అయినా మీ పట్ల తెలంగాణ బీసీ సమాజం వైఖరి సానుభూతిగానే ఉంటూ వస్తుంది.
అయితే బీసీ బిల్లుల పట్ల మీ వైఖరి కూడా తెలంగాణ బీసీ సమాజాన్ని అసంతృప్తి పరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు చేస్తున్న ద్రోహం మీకు తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు. అయినా పర్వాలేదు. మీ నిస్సహాయ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాం. ఎందువల్లనో కాని వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణ బీసీ బిల్లులను మీరు ఎజెండా చేయలేక పోయారు. దానికి మీరు బాధ్యత వహించాలి కదా! బీహార్ బీసీ సమాజాన్ని మీ వైపు తిప్పుకోవడానికి అయినా… రాజకీయం కోసమైనా ఈ పని చేయాల్సి వుండింది. ఆపరేషన్ సింధూర్ అప్పటికి ఓడిసిపోయిన యుద్ధం. “చచ్చిపోయిన దుడ్డే పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చింది” అన్నట్లు ఓడిసిపోయిన యుద్ధం మీద మీరు పార్లమెంటులో యుద్ధం చేశారు. ఈవీఎంల వల్ల ఫలితాలు తారుమారు చేస్తున్నారని బహుజన ఉద్యమ సంస్థలు ఎంత మొత్తుకున్నా దాన్ని పట్టించుకోకుండా వుంటున్నారు. మీకున్న సాంకేతిక పరిజ్ఞానం, మీ పార్టీ అనుబంధ సాంకేతిక బృందం దాని మీద ద్రుష్టి సారించదు. ఎక్కడో అరకొర జరిగే దొంగ ఓట్లను పెద్ద ఎత్తున ఇష్యూ చేశారు. మీరేది చేసినా ఒక అస్పష్టత మిమ్మల్ని వెంటాడుతుంది. ఆపరేషన్ సింధూర్, ఓటు చోరీ ఏ వర్గ ప్రజల్ని మీకు దగ్గర చేయలేకపోయినయి. బీసీ అంశాన్ని పార్లమెంటులోనూ బీహార్లోను ఇష్యూ చేయగలిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బీహార్ బీసీలను మీ వైపు తిప్పుకునే అవకాశం ఉండేది. ఆపరేషన్ సింధూర్, ఓటు చోరీ లాంటి అంశాలు మిమ్మల్ని పోరాడే వీరుడుగా చూపెట్టింది నిజమే కానీ ఏ వర్గపు ప్రజలను మీ వైపు తిప్పుకోవడానికి అక్కరకు రాలేదు.
ఇక పోరాట రూపాలకు సంబంధించి కూడా మీకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. మీరు ఎప్పుడు యుద్ధ రంగంలో ఉంటారో…ఎప్పుడు మాయం అయిపోతారో… మీ పార్టీ వారే నిశ్చితంగా చెప్పలేని పరిస్థితి. మీ పేరులో గాంధీ ఉంటాడు. మీ పార్టీ గాంధీ సిద్ధాంతాలు పాటిస్తుందని చెబుతారు. గాంధీ తరహా పోరాటాలు చేయాలని ఆలోచన మీకు ఉన్నట్లు లేదు. విదేశీ పాలనలో కూడా మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించాడు. స్వదేశీ పాలనలో మీరు కాంగ్రెస్ ను గెలిపించలేకపోతున్నారు. విప్లవోద్యమంలో పనిచేసిన మేము సైతం గాంధీని చదివి బీసీ అంశం మీద హైదరాబాదులో 12 రోజులు ఢిల్లీలో 22 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేసినం. ఈ దీక్షల కంటే ముందు ఢిల్లీలో మీ ఏఐసీసీ ఆఫీస్ కార్యాలయానికి ఐదు సార్లు వచ్చి మీ అనుచరులకు సమాచారం ఇచ్చాము. అయినా వారు మీ దృష్టికి తీసుకువచ్చినట్లు లేదు. మీ పార్టీ వారు చేయరు. చేస్తున్న మాకు సంఘీభావం చెప్పరు. బహుశా మీ చుట్టూ ఉన్న శకుని మామలను దూరం పెట్టకపోతే ఎన్నటికీ మీకు కర్తవ్యం బోధపడదు.

గాంధీ తరహ పోరాటాలకు సిద్ధం కావాలి,

బిహార్ ఎన్నికల్లో జరిగిన నష్టం ఏదో జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బిహార్ ఎన్నికలను తలుచుకొని డిప్రెషన్ లో పడాల్సిన అవసరం లేదు. బీసీ అంశం మీద మీరు చేయగలిగే పోరాటమే మీ భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తుంది. మాన్యశ్రీ కాన్షీరాం, బీసీ సమస్య ఈ దేశ సమస్య అన్నాడు. మీరు 10 శాతం, 90 శాతం పంచాయితీలోకి వచ్చారు కనుక కాన్సీరాంను స్వీకరించక తప్పదు. మీ పేరులోనే గాంధీ ఉంది. గాంధీ పోరాట రూపంతో మీరు నిలబడవచ్చు. రాహుల్జీ జనం ఓట్లు వేస్తే గెలిచినంక చేస్తాను అంటే సరిపోదు. కాబట్టి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లులను ఎజెండా చేయాలి. బీసీ అంశం మీద సీరియస్ గా ఉద్యమించాలి. గాంధీ తరహా ఆమరణ దీక్షలకు పూనుకోవాలి. ఒకవేళ మీ ఆరోగ్యం సరిగా లేకుంటే కేజ్రీవాల్ తరహా అన్నాహాజరే సహాయం తీసుకున్నట్టు… ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండే మాలాంటి వారు మీ పార్టీలో ఉంటే వారి సహాయం తీసుకోవచ్చు. లేదా మాలాంటివారు ఆమరణ దీక్ష చేసినప్పుడు పక్కన వచ్చి కూర్చోవచ్చు. ఈ లేఖ మీ వరకు చేరుకోవాలని కోరుకుంటూ…
నమస్కారాలతో…
బత్తుల సిద్దేశ్వర పటేల్,
జాతీయ అధ్యక్షులు
హిందూ బీసీ మహాసభ
9704672813

Exit mobile version