మాదకద్రవ్యాల ఉచ్చులో మైనర్లు !? పెరుగుతున్న నేరాలు !

విశ్లేషణ, అభిప్రాయం ,

Kura Yadaiah చీప్ ఎడిటర్|11/2025,

-వేమ రేడ్డి యేట్ర విశ్లేషకులు,

మాదకద్రవ్యాల ప్రభావంతో రోజురోజుకు పట్టణాల నుండి పంచాయతీల వరకు నేరాల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని పలువురు సామాజిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు……

తాండూర్: ఇటీవల మహారాష్ట్ర లోని పూణేలో ఓ మైనర్ అబ్బాయి మద్యం మత్తులో తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యంత ఖరీదైన విదేశీ కారుతో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమై ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాడు. తప్పు చేసిన ఆ మైనర్ అబ్బాయిని చట్టం నుండి తప్పించడానికి ఆ ధనిక తండ్రి (రియల్ ఎస్టేట్ వ్యాపారి) తనకున్న రాజకీయ బలంతో పోలీసులను, వైద్యులను, న్యాయస్థానాన్ని ప్రభావితం చేశాడు. ప్రజలు ఉద్యమించడంతో ఇద్దరు పోలీసు అధికారులు, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు వైద్య సిబ్బంది, మైనర్లకు మద్యం అమ్మినందుకు వైన్ షాపు యజమాని అరెస్టయి జైల్లో వున్నారు. నేరస్థునికి త్వరపడి బెయిల్ ఇచ్చిన కోర్టు బెయిల్ను రద్దు చేసుకోవలసి వచ్చింది.

ఇలాంటి సంఘటన ఒక్క పూణే కు మాత్రమే పరిమితమైంది కాదు. ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహా నగరాలతో మొదలు కొని పట్టణ తరహా మేజర్ పంచాయితీల వరకు విస్తరిస్తున్నాయి.

మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన మైనర్ పిల్లలు చేస్తున్నది కేవలం రోడ్డు ప్రమాదాలే కాదు, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, దొంగతనాలు, అనేక రూపాల్లో నేర చర్యలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల మన రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించలేదని గొంతు కోసిన సంఘటన సంచలనం కలిగించింది.

కార్పొరేట్ జూనియర్ కాలేజీ హాస్టల్ క్యాంపస్లలో గంజాయి, మద్యం బాటిల్స్ లాంటివి బయటపడ్డాయి. అతివేగంగా వాహనాలు నడపడం, ఎవరినీ ఖాతరు చేయకపోవడం లాంటి అనేకు వికృత పోకడలు మైనర్ పిల్లల్లో పెరుగుతున్నాయి. అందరూ ఇలా వున్నారని కాదు. కొందరైనా ఎందుకు ఇలా వుండాలి? మంచి భవిష్యత్త్ ఉన్న పిల్లలు చిన్న వయసులోనే నేరస్థులుగా ఎందుకు మారాలి? వీటికి కుటుంబం, సమాజం, ప్రభుత్వాలు, వ్యవస్థలు సరైనా పరిష్కారాలు చేపట్టకపోతే బాలనేరాలను అరికట్టలేము.

దేశంలో మైనర్ పిల్లల్లో 40 లక్షల మంది గంజాయి, నల్లమందు, 30 లక్షల మంది మద్యం, మరో 72 లక్షల మంది వివిధ రకాల మత్తు పదార్ధాలు, స్థానిక మద్యం తీసుకుంటున్నట్లు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు నివేదించింది. ఈ లెక్కలు రిజిష్టర్ అయిన పోలీసు కేసుల ఆధారంగా నమోదైనవి. వాస్తవానికి ఈ సంఖ్య కోట్లలో వుండే అవకాశం వుంది. అత్యంత ప్రమాదకరమైన కొకైన్ లాంటి మత్తు మందు కాలేజీలు, పాఠశాలల స్థాయిలో బయటపడుతున్న సంఘటనలు చూస్తున్నాము. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మత్తుమందుకు అలవాటు పడిన వారు ఎంతటి పాశవిక నేరాలకైనా తెగబడుతున్నారు. ఈ మత్తు పదార్థాలకు అలవాటుపడిన బాలలు చేస్తున్న నేరాలు 2001 నుండి 2021 నాటికి 74 శాతం పెరిగినట్లు జాతీయ నేర పరిశోధన (ఎన్సీఆరిబి) సంస్థ ప్రకటించింది.

ఇంత పెద్ద స్థాయిలో నేరాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళనకరం. మైనర్లు చేసిన నేరాలు కొన్ని దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో బస్సులో అమ్మాయిపై జరిగిన ఘోరమైన అత్యాచారంలో నేరస్థుల్లో ఇద్దరు మైనర్లు, 2019 నవంబర్లో హైద్రాబాద్లో డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యలో ఒకరు మైనర్. ఈ సంఘటనలపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. కఠిన శిక్షలు వేసేందుకు చట్టాల్లో కొన్ని మార్పులు చేసారు. కానీ ఇలాంటి సంఘటనలు తగ్గకపోగా పెరుగుతూనే వున్నాయి. 2017- 2019 మధ్యకాలంలో నేరాల్లో పాల్గొన్న బాల నేరస్థుల కేసులు సంఖ్యను ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. తమిళనాడులో 2017-19 మధ్య 2,376, 2,304, 2,686. మధ్యప్రదేశ్ లో , 6,491, 5,880, 5,522. మహా రాష్ట్ర లో 6,026,
5,232, 5,189. కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేరాలకు పాల్పడిన పిల్లల్లో అత్యధికం మత్తు పదార్ధాలకు, జల్సాలకు అలవాటు పడినవారు వుంటున్నారు.

ప్రపంచీకరణ విధానాల పేరుతో విదేశీ సంస్కృతిని దేశంలోకి దిగుమతి చేసుకున్నాము. అలవాట్లు, ఆలోచనల్లో గణనీయమైన మార్పులు కుటుంబ జీవితంలో వచ్చాయి. వీటి ప్రభావం బాలల మీద ఎక్కువగా వుంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వున్నప్పుడు పిల్లలకు చిన్నప్పటి నుండే కొన్ని పద్ధతులు కథలు, అనుభవాల రూపంలో పెద్దలు చెప్పేవారు. టివి, సెల్ వచ్చిన తర్వాత చెప్పేవారు లేరు. చెప్పినా వినేవారు లేరు. వ్యాపార ధోరణి పెరిగే కొద్ది దురలవాట్లు కూడా ఫ్యాషన్గా మారిపోయాయి. మైనర్ పిల్లలు గంటల కొద్ది టీ కేఫ్ కూర్చోవడం, ప్రతి చిన్న సందర్భానికి మందు పార్టీలు, పబ్లకు, టూర్లకు వెళ్ళడం పెరిగింది. ఇలాంటి వాటికి అవసరమైన డబ్బుల కోసం అనేక పద్ధతులకు తెగబడుతున్నారు. మైనర్ పిల్లల్లో పెరుగుతున్న వ్యసనాలు,దానివల్ల సమాజానికి కలిగే దుష్పలితాలు, నేరాల నుండి తమ పిల్లలను కాపాడుకునేందుకు తల్లితండ్రులు చేస్తున్న వికృత సమర్ధనలు, డబ్బుకు, రాజకీయ పలుకుబడికి లొంగుతూ వీటిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న పోలీసు, న్యాయ వ్యవస్థల్లో కొందరైనా తోడుకావడం పూణే సంఘటనలోనే కాదు అనేక సందర్భాల్లో చూస్తున్నాము.

యుక్తవయసు రాకనే నేరాలకు పాల్పడే పిల్లలను జువైనల్ అంటారు. దీని అర్ధం పెద్దలు చేసే విధంగానే వీరి నేరాలు వుంటాయి గానీ వయసులో మైనర్లు, చట్టబద్ధంగా బాల నేరస్థుడుగా ప్రకటించడానికి కనీస వయసు 14, గరిష్ట వయసు 18 సంవత్సరాలు వుండాలి. బాల నేరస్థుల్లో ఎక్కువ మంది 16-18 సంవత్సరాల మధ్య వయసు వున్నవారే వుంటున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారి ఆలోచనల్లో క్రమంగా తీవ్రమైన మార్పులు రావడం, వారి జీవనశైలి ఆకస్మికంగా మార్పులకు గురికావడం, సిగరెట్లతో మొదలైన వీరి దురలవాట్లు మత్తుపానీయాలు, గంజాయి, నల్లమందు, కొకైన్ లాంటి వాటికి బానిసలుగా మారడం, విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడడం అనే సాధారణ లక్షణాలు వీరందరిలో వున్నట్లు వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి. కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ అవసరాలను తీర్చుకోవడానికి ఎంతటి నేరానికైన పాల్పడే మనస్తత్వం పెరగడం పిల్లల ఆలోచనలు, జీవిత విధానంలో వస్తున్న మార్పులు, అందుబాటులో వున్న మద్యం, సెల్ఫోన్స్, ఇంటర్నెట్ లాంటి సాంకేతిక సదుపాయాలు, అశ్లీల వీడియోలు, చిత్రాలు, స్నేహితుల ప్రభావాలు ప్రధానంగా వుంటున్నాయి.

బాలలు నేరస్థులుగా మారడంలో కుటుంబ పరిస్థితులు ప్రధాన కారణంగా వుంటున్నాయి. పేద కుటుంబాల్లో చదువు లేకపోవడం, ఆర్థిక పరిస్థితులే ఈ నేరాలకు కారణాలుగా ఇన్నాళ్లు భావిస్తు వచ్చారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులలో ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతికి కుటుంబాలకు చెందిన చదువుకున్న పిల్లలు వుంటున్నారు. తల్లితండ్రులు తమ వృత్తిపరమైన ఒత్తిళ్ళ వల్ల పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. వున్న సమయంలో టివి, సెల్లు చూడడానికి ఎక్కువ సమయం ఇవ్వడం, పిల్లల్లో అలవాట్లలో, ఆలోచనల్లో వస్తున్న మార్పులను గమనించకపోవడం, వారు కోరిన వాటిని ఒకరికి తెలియకుండా మరొకరు ఏర్పాటు చేయడం, తమ పిల్లలు ఖరీదైన స్కూటర్లు, కార్లలో తిరగడం తమ హోదాగా భావించే మనసత్వం తల్లిదండ్రుల్లో పెరగడం ఈ తరహా నేరాలకు కారణాలుగా వుంటున్నాయి.

విలాసవంతమైన జీవితానికి, వ్యసనాలకు అలవాట్లు పడిన వారు అవి తీర్చుకోవడానికి ఇంట్లో అవకాశం లేకపోతే వీధుల్లో తీర్చుకుంటారు. చైన్ స్నాచింగ్లు, స్కూటర్ల దొంగతనాల కేసుల్లో ఇంటర్, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు పట్టుబడడం ఇందులో
భాగమే. నేరానికి పాల్పడిన తమ పిల్లలను ఆ అలవాట్లనుండి మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడానికి బదులు స్నేహితులు, పరిస్థితులు కారణాలుగా చూపి తమ పిల్లలను సమర్థించుకుంటున్న తల్లితండ్రులు వున్నారు. ఇలా సమర్ధించబడిన పిల్లలు ఒకటికి మించిన నేరాలకు పాల్పడుతున్నట్లు నేర పరిశోధనలు చెబుతున్నాయి.

బాల్యనేరాలను అరికట్టడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. కుటుంబ సభ్యులతో పాటు, పోలీసు వ్యవస్థ ఈ తరహా నేరాలు జరగకుండ ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. మేధావులు, ప్రజాతంత్రవాదులు నేరం జరిగినప్పుడు స్పందించడం కాకుండా బాలల వికాసానికి అవసరమైన విజ్ఞాన, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించాలి. బాలల భవిష్యత్తును కాపాడుకోవడంలోనే సమాజ భవిష్యత్త్ వుంది.

 

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *